నస్పూర్, వెలుగు: మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు జీఐఎస్ ఆధారిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ అడిషనల్ సంచాలకుడు రమేశ్ బాబు, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ శివాజీతో కలిసి సంబంధిత అధికారులకు మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల రూపకల్పనపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తామన్నారు. కార్పొరేషన్ రూపకల్పనలో నివాస ప్రాంతాలు, పారిశ్రామికంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందే ప్రాంతాలను గుర్తిస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, నెట్వర్క్, ట్రాఫిక్ ప్లానింగ్, మెడికల్, నీటి వనరులు, పరిశ్రమల స్థాపన ఇతర అంశాలకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖల నుంచి సేకరిస్తామని తెలిపారు.
అర్హత గల వారికి పరిహారం అందిస్తాం
మంచిర్యాల–వరంగల్–ఖమ్మం–విజయవాడ జాతీయ రహదారి 163జి నిర్మాణంలో భూములు కోల్పోయిన అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన బాధితుల వివరాలను జిల్లా కేంద్రంలోని ఆర్డీవో ఆఫీసులో పరిశీలించారు. జాబితా ప్రకారం బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని, ఆర్బిట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పరిహారం అందించేలా చూస్తామన్నారు. మొదటి జాబితాలో పరిహారం అందనివారు సంబంధిత పత్రాలు, బ్యాంక్ పాస్ పుస్తకాలతో సంప్రదించాలని సూచించారు.
పీఓఎస్ పరికరాల అందజేత
పీవోఎస్ పరికరాలతో స్త్రీ నిధి పథకం క్రింద రుణాల మంజూరు, వసూలు ప్రక్రియ సులభతరంగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివాజి, లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్, మెప్మా పీడీ మారుతి ప్రసాద్ తో కలిసి వీవోఏ/ ఆర్పీ, గ్రామ సంఘాలకు పీవోఎస్ పరికరాలు అందించారు.
పీవోఎస్ పరికరాల ద్వారా పొరపాట్లు లేకుండా స్త్రీ నిధి పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరుతో పాటు వసూళ్ల ప్రక్రియ సులభంగా నిర్వహించవచ్చని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కిషన్, స్త్రీ నిధి జోనల్ మేనేజర్ రవికుమార్, రీజనల్ మేనేజర్ వెంకట రమణ, టీఎంసీలు తదితరులు పాల్గొన్నారు.